చిరంజీవి: నాడు చిరంజీవి గారి సలహాతో నా మోకాలి నొప్పి మాయమైంది: పరుచూరి గోపాలకృష్ణ

  • నాడు మెట్లు ఎక్కొద్దని, నడవొద్దని వైద్యులు సూచించారు
  • ఓ సందర్భంలో చిరంజీవి గారికి ఈ విషయం చెప్పా
  • చిరంజీవి గారు ఓ ఎక్సర్ సైజ్ చెప్పారు
  • ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ

గతంలో తనకు మోకాలినొప్పి వస్తే హైదరాబాద్ లో ఉన్న ప్రతి స్పెషలిస్టుని కలిసినా ఫలితం లేకుండా పోయిందని, ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహాతో ఆ నొప్పి మాయమైపోయిందని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ  నాటి సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

'పరుచూరి పలుకులు’ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘మోకాలి నొప్పితో బాధపడుతున్న నేను అప్పుడు వైద్యులను సంప్రదించాను. మీ జీవితకాలంలో ఇంకెప్పుడూ మెట్లు ఎక్కొద్దు, నడవొద్దని చెప్పారు. అయితే, ఓ రోజున ఓ చిత్రం షూటింగ్ లో ఉన్న చిరంజీవిగారి దగ్గరకు వెళ్లా. మేడపైన షూటింగ్ జరుగుతుండటంతో నన్ను పైకి రమ్మనమని చెప్పడం..నేను మెట్లు ఎక్కలేక కింద ఉండిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవిగారు కిందకు దిగి వచ్చారు.

‘మేడ పైకి రాలేకపోవడం ఏంటీ?’ అని ఆయన అడిగారు. ‘మోకాలినొప్పిగా ఉంది, మేడమెట్లు ఎక్కొద్దని డాక్టర్లు చెప్పారు’ అని చెప్పాను. అందుకు, చిరంజీవిగారు నవ్వారు. ఆ తర్వాత నన్ను వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. ఒక్కోటి కిలో బరువు ఉన్న రెండు ఇసుక బస్తాలను చిరంజీవి గారు తన రెండు కాళ్లపైన పెట్టుకుని ఓ ఎక్సర్ సైజ్ చేసి చూపించారు. ‘డాక్టర్లు అలాగే చెబుతారు! నన్నూ అలాగే భయపెట్టారు! నా లైఫ్ లో డ్యాన్స్ చేయలేనని డాక్టర్లు అన్నారు. ఈ రోజున నేను ఏం చేస్తున్నానో చూశారుగా! కంగారుపడకండి, ఈ ఎక్సర్ సైజ్ చేయండి’ అని చిరంజీవి గారు సలహా ఇచ్చారు.

ఆయన ఇచ్చిన సలహా పాటించా.. 2001 నుంచి ఇప్పటివరకు, పదహారు సంవత్సరాలుగా ఐదు అంతస్తుల బిల్డింగ్ మెట్లు అయినా ఎక్కేస్తున్నా. ఓ అద్భుతమైన సలహా ఇచ్చిన చిరంజీవిగారు, ఆ ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా ఓ కాగితం మీద టైప్ చేసి మరీ ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చారు గోపాలకృష్ణ.

  • Loading...

More Telugu News