జైపాల్ రెడ్డి: ప్రధాని మోదీ అంటే కేసీఆర్ కి వణుకు: కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి
- మీడియాతో మాట్లాడిన జైపాల్ రెడ్డి
- ‘కల్వకుర్తి ఎత్తిపోతల’పై టీఆర్ఎస్ నాయకుల ప్రచారం అబద్ధం
- తెలంగాణలో ప్రాజెక్టులను ‘కాంగ్రెస్’ అడ్డుకోవట్లేదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమన్నా, ప్రధాని నరేంద్రమోదీ అన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ కు వణుకు పుడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ నేతల తీరును ఆయన తప్పుబట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతలపై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ పథకం పురుడుపోసుకుందని చెప్పారు.
తమ వల్లే ఈ పథకం వచ్చిందని కొందరు మంత్రులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందనే తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ నిర్ణయాలు సామాన్యుడికి శాపంగా మారాయని, పత్రికలను భయపెట్టే విష సంస్కృతిని ఆయన తీసుకువచ్చారంటూ జైపాల్ రెడ్డి ఆరోపించారు.