రామ్ గోపాల్ వర్మ: అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఎన్నో రకాల కామెంట్లు చేస్తున్నారు: రామ్ గోపాల్ వర్మ
- ఈ సినిమా కథ గురించి ఎవ్వరూ సరిగా 10 సెకన్లు కూడా ఆలోచించలేదు
- సినిమాల్లో ఏయే పాత్రలు ఉంటాయో నేనిప్పుడు చెప్పను
- లక్ష్మీ పార్వతి ఏం చెప్పారో అది తీస్తే అందరికీ తెలిసిందే చెప్పడం అవుతుంది
- ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత తెరవెనుక ఏం జరిగిందో తీయాల్సి ఉంది
తాను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తానని చెప్పిన అంశంపై ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్లు చేస్తున్నారని, ఈ సినిమా కథ గురించి ఎవ్వరూ సరిగా 10 సెకన్లు కూడా ఆలోచించకపోయి ఉండొచ్చని, అందుకే ఎన్నో రకాల కామెంట్లు చేస్తున్నారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ‘సినిమాల్లో ఏయే పాత్రలు ఉంటాయో నేనిప్పుడు చెప్పను.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఏమీ మాట్లాడలేదు. వారు రామారావు గురించి చెప్పాల్సింది అంతా ఇప్పటికే మీడియా ముందు చెప్పేశారు. నేను మాత్రం ఎన్టీఆర్ గురించి ఎవ్వరికీ తెలియంది చూపాలనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు.
‘గాంధీ జీవిత కథలో బ్రిటీష్ వారు, వారితో పోరాటం లాంటిది ఉంటుంది. ఆయన గురించి సినిమా తీస్తే అవి చూపించాలి. కానీ, ఎన్టీఆర్ జీవితంలో అటువంటివి లేవు’ అని వర్మ అన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో అనుభవించిన పరిస్థితులు వేరు.. ఆయన సినిమాల్లో రాణించి, రాజకీయాల్లో సక్సెస్ అయినప్పటి పరిస్థితులు వేరని అన్నారు. ఎన్టీఆర్ గురించి తెలుసుకుంటుంటే ఆయన దైవాంశ సంభూతుడని అనిపించిందని తెలిపారు. ఎన్టీఆర్ సూపర్‌స్టార్ అయిన విధానం, గొప్ప రాజకీయ నేత అయిన విధానం అన్నీ హర్షించదగినవేనని అన్నారు.
అన్ని అంశాల్లోనూ సూపర్.. సూపర్ అని అందరూ అనుకున్న ఓ మనిషి.. ఒక సాధారణ మహిళ (లక్ష్మీ పార్వతి) ని తన జీవితంలోకి ఆహ్వానించిన తీరు కొత్త కోణంలో ఉందని వర్మ చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలోని అన్ని అంశాలు వేరని, లక్ష్మీ పార్వతి ఎంటరైన తరువాత ఉన్న పరిస్థితి వేరని అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఎవరు ఎంటరైన తరువాత ఆయనలో ఎప్పుడూ చూడని మార్పు వచ్చిందన్న విషయాన్ని చూపిస్తానని చెప్పారు. చివరి రోజుల్లో బాధాకర మానసిక పరిస్థితుల్లోకి ఎన్టీఆర్ వచ్చిన తీరును చెబుతానని అన్నారు. లక్ష్మీ పార్వతి ఏం చెప్పారో అది తీస్తే అందరికీ తెలిసిందే చెప్పడం అవుతుందని, ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత తెరవెనుక ఏం జరిగిందో తీయాల్సి ఉందని అన్నారు.