సీఎం కేసీఆర్: లక్షమంది ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అడ్డుకున్నా ఈ ప్రాజెక్ట్ ఆగదు: సీఎం కేసీఆర్
- సూర్యాపేట సభలో కేసీఆర్
- కాళేళ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం
- ‘నల్గొండ’కు పూర్వ వైభవం తెస్తాం
- కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ ముఖ్యమంత్రి
లక్ష మంది ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అడ్డుకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగదని, పూర్తి చేసి తీరుతామని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి సభలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు పూర్వవైభవం తెస్తామని, సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. మొదట్లో నాగార్జునసాగర్ ని ఏలేశ్వరం వద్ద నిర్మించాలని ముందుగా నిర్ణయించారని, అయితే కాంగ్రెస్ నేతలు చేసిన మోసం వల్లే స్థలం మారిందని, ఆ ప్రాజెక్ట్ అసలు పేరు నందికొండ అని, ఆ తర్వాత దాని పేరును నాగార్జునసాగర్ గా మార్చారని నాటి విషయాలను ప్రస్తావించారు.
అదే కనుక, ఏలేశ్వరం వద్ద ప్రాజెక్ట్ ని కట్టినట్టయితే నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని అన్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు వద్ద 65 వేల క్యూసెక్కుల కాలువ తవ్వితే కాంగ్రెస్ నేతలు నోరుమెదపలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతల నోళ్లు అప్పుడు మూతపడ్డాయా? అంటూ మండిపడ్డారు.