కేసీఆర్: ఈ కేటీఆర్ అప్పుడేమో సిరిసిల్లను జిల్లా చేస్తే చాలన్నారు.. ఇప్పుడు కోట్లు కావాలంటున్నారు: కేసీఆర్ చమత్కారం
- సిరిసిల్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
- కేటీఆర్ పై కేసీఆర్ చలోక్తులు
- సిరిసిల్ల జిల్లాలకు నిధులు కావాలన్న కేటీఆర్
- రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల నిధులు కావాలంటున్నారని కేసీఆర్ చమత్కారం
తన ప్రాణాలను పణంగా పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ... కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేసీఆర్ను ఆయన కోరారు.
అనంతరం మాట్లాడిన కేసీఆర్... ‘రామారావు గారు బాగా హుషారయ్యారు.. మొదట జిల్లా ఇస్తే చాలు అన్నారు.. ఇప్పుడు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు ఇవ్వాలంటున్నారు. సిరిసిల్ల నీళ్లు బాగా ఒంటబట్టినట్టున్నాయి’ అని చమత్కరించారు. కాగా, ఈ ప్రాంతం వెనుకపడ్డ ప్రాంతమని, కరవుతో ఇబ్బందులు ఎదుర్కున్న ప్రాంతమని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు సిరిసిల్లలోని ప్రజల బతుకులు చూసి చలించిపోయామని చెప్పారు. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు.