బయ్యారం: బయ్యారం గనులను సింగరేణికే అప్పగిస్తాం: సీఎం కేసీఆర్
- సింగరేణి యాత్రకు వచ్చినప్పుడు కొత్తగా 6 గనులను ప్రారంభిస్తా
- 8 వేల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి
- ఉద్యోగం వదులుకునే కార్మికులకు నెలకు రూ.25 వేలు
- ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం
బయ్యారం ఇనుప గనులను సింగరేణికే అప్పగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో సింగరేణి కార్మికులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, సింగరేణి యాత్రకు వచ్చినప్పుడు కొత్తగా 6 గనులను ప్రారంభిస్తానని, కొత్త గనుల ప్రారంభం వల్ల మరో 8 వేల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఉద్యోగం వదులుకునే కార్మికులకు నెలకు రూ.25 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని, కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ లాభాల వాటాలో అధికభాగం కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేస్తామని, సింగరేణి ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ జయంతి రోజున సింగరేణి కార్మికులకు అధికారిక సెలవు ఇస్తున్నట్టు ఈ సందర్బంగా కేసీఆర్ ప్రకటించారు. సింగరేణి కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు వస్తే పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.