వైసీపీ: వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని జగన్ కు భయంగా ఉంది: కేఈ కృష్ణమూర్తి
- వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్న మాట వాస్తవం
- ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ కు జైలు తప్పదు
- సీఎం చంద్రబాబు నాకు ప్రాధాన్యమివ్వడం లేదనేది అవాస్తవం
తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీని ఎక్కడ వీడతారోననే భయం ఆ పార్టీ అధినేత జగన్ కు పట్టుకుందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారనే మాట వాస్తవమని, ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
రెవెన్యూ శాఖకు సంబంధించిన వ్యవహారాల నుంచి తనను దూరంగా పెట్టారనేది వాస్తవం కాదని అన్నారు. ఆర్డీవోల బదిలీలపై ఎమ్మెల్యేల ఒత్తిడిని తగ్గించేందుకే బదిలీ అధికారాన్ని సీఎం చంద్రబాబు తీసుకున్నారని చెప్పారు. కర్నూలు జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని, హంద్రీనీవా జలాల పంపిణీ వ్యవహారంలో కర్నూలు జిల్లాకు అన్యాయం జరగదని చెప్పిన కేఈ, కాలువలకు గండ్లు కొడతానని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనడం సబబు కాదని అన్నారు. రుణమాఫీ కింద అతిత్వరలోనే ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.2 వేలు ఇస్తామని అన్నారు.