టీటీడీపీ: టీటీడీపీ నేతల వ్యవహారశైలిపై చంద్రబాబు సీరియస్!
- టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
- పొత్తుల విషయమై ఇష్టానుసారం మాట్లాడొద్దని హెచ్చరిక
- గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బాబు ఆదేశాలు
టీటీడీపీ నేతల వ్యవహారశైలిపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడం, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయమై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడవద్దని పార్టీ నేతలు, నాయకులను హెచ్చరించినట్టు సమాచారం. తనపై ఆధారపడకుండా సొంతంగా తెలంగాణలో బలపడాలని, గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.
కాగా, తొలిసారిగా టీటీడీపీ సమావేశానికి దేవేందర్ గౌడ్, ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. చంద్రబాబుకు రెండు వినతిపత్రాలను ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అందజేశారు. ఏపీలో 4,500 మంది బీసీ ఐఏఎస్ అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయా వినతిపత్రాల్లో కోరినట్టు సమాచారం. ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.