డోక్లాం స్టాండ్ ఆఫ్: డోక్లాంలో మళ్లీ మరో రహదారి విస్తరణ పనులు చేపట్టిన చైనా.. 500 మంది సైనికుల గస్తీ!
- డోక్లాం భూభాగం తమదేనని అంటోన్న చైనా
- డోక్లాంకి 10 కిలోమీటర్ల దూరానికి చేరుకున్న రహదారి విస్తరణ పరికరాలు
- ఆ ప్రాంతం తమదేనని చెప్పేందుకు చైనా మరోసారి ప్రయత్నం
భారత్, చైనా మధ్య చెలరేగిన డోక్లాం ప్రతిష్టంభన ఇటీవలే సమసిపోయి శాంతియుత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అక్కడినుంచి రహదారి విస్తరణకు ఉపయోగించే పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. అయితే, చైనా మళ్లీ మరోసారి తన బుద్ధి చూపిస్తోంది. డోక్లాంకి 10 కిలోమీటర్ల దూరంలో మరో రహదారి విస్తరణ పనులను చేపట్టింది. చైనా రోడ్డు నిర్మిస్తోన్న ప్రాంతానికి దాదాపు 500 మంది చైనా సైనికులు ఇప్పటికే వచ్చేసి గస్తీ కాస్తున్నారు.
ఆ ప్రాంతం నుంచి ఇటీవల వెనక్కు తీసుకెళ్లిన రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే సామగ్రినే మళ్లీ వినియోగిస్తూ చైనా రోడ్డు పనులు చేపడుతోందని నిఘావర్గాలు చెప్పాయి. దీని ద్వారా ఆ వివాదాస్పద ప్రాంతం తమదేనని చెప్పేందుకు చైనా మరోసారి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై భారత్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. నిజానికి ఆ భూభాగం భూటాన్ కి చెందింది. ఆ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మిస్తే భారత రక్షణకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది.