కంచ ఐల‌య్య‌: నాకు తెలంగాణ‌లో కంటే ఆంధ్రాలోనే ఎక్కువ‌గా అభిమానులు ఉన్నారు: కంచ ఐల‌య్య‌

  • కేజీ నుంచి పీజీ అని నినాదం ఇచ్చారు.. చ‌దువు అలా ఉండ‌దు
  • ఎల్‌కేజీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సర్కారు స్కూళ్ల‌లో ఇంగ్లిషుని తప్పనిసరిగా నేర్పించాలి
  • ప్రైవేట్ సెక్టార్లో కిందికులాల వారిని ఎదగనివ్వకుండా అగ్ర‌కులాల వారు కుట్రలు చేస్తున్నారు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ 'కేజీ నుంచి పీజీ' వరకు విద్య ఉచితం అంటూ నినాదం ఇచ్చార‌ని, చ‌దువు అలా ఉండ‌ద‌ని కంచ ఐల‌య్య అన్నారు. ఎల్‌కేజీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అన్ని స్కూళ్ల‌లోనూ ఇంగ్లిషుని త‌ప్ప‌నిస‌రి చేయాలని అన్నారు. ఇంగ్లిషులో చ‌దువుకోవ‌డం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్ల‌ల హ‌క్కుగా మారాలని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో తమ డిమాండ్ అదేనని అన్నారు.

ఏ అంటే ఆపిల్ అని చ‌దివించ‌వ‌ద్ద‌ని, విదేశీ విద్య వ‌ద్ద‌ని, ఇండియ‌న్ ఇంగ్లిష్ నేర్పించాల‌ని అన్నారు. ఏ అంటే యాంట్ అని నేర్పాల‌ని చెప్పారు. కింది కులాల వారికి చీమ ప్ర‌తిరోజు క‌నిపిస్తుంద‌ని, వారు యాపిల్ ను ప్రతిరోజు చూడ‌బోర‌ని తెలిపారు. త‌న‌కు తెలంగాణ‌లో కంటే ఆంధ్రాలోనే ఎక్కువ‌గా అభిమానులు ఉన్నార‌ని, ఆంధ్రోళ్ల‌ని కేసీఆర్‌, క‌విత, హ‌రీశ్ లాంటి వారు అప్పట్లో బండ బూతులు తిడుతోంటే, తాను తిట్టొద్ద‌ని చెప్పాన‌ని అన్నారు. గవర్నర్ నరసింహన్ కాళ్లు మొక్కే కేసీఆర్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కాళ్లు మాత్రం మొక్కడం లేదని ఐలయ్య ఆరోపించారు.

వచ్చే ఎన్నికల నాటికి నారాయణ, చైతన్య కాలేజీలను పూర్తిగా తీసేయాలని ఐలయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రలోని కింది కులాల వారు తెలంగాణలోని కింది కులాల వారు అన్న‌ద‌మ్ముల్లాంటి వార‌ని కంచ ఐలయ్య చెప్పారు. ప్రైవేట్ సెక్టార్లో అగ్ర‌కులాల వారు అధికంగా ఉండ‌డంతో త‌మ‌కు అక్క‌డ‌ ఉద్యోగాలు రావ‌డం లేద‌ని, ఆ సెక్టార్లో రిజ‌ర్వేష‌న్లు రావాల‌ని కింది కులాల వారు పోరాడుతున్నార‌ని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్లో పై స్థాయిలో ఉన్న అగ్ర‌కులాల వారంతా కిందికులాల వారికి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నార‌ని తెలిపారు. ఒక్క 20 ఏళ్ల స‌మ‌యం ఇస్తే అగ్ర‌కులాల వారిని మించి ప్రైవేటు రంగంలో కిందికులాల వారు ఉంటార‌ని అన్నారు.

తాను పెద్ద కులాన్ని అవ‌మానించాన‌ని బ్రాహ్మ‌ణులు, వైశ్యులు విర్రవీగుతున్నారని, వారి అహంకారానికి వారి అధికారం, డ‌బ్బే కార‌ణ‌మ‌ని తెలిపారు. ఈ దేశ చరిత్రకు మూలం కుండ అని, చెప్పులు అని, మంగలి కత్తి అని అన్నారు. ఆ పనులు చేసుకునే వారికి నీతి ఉంది కాబట్టే వారిని తిడుతోన్న అగ్రకులాల వారిని ఏమీ చేయలేదని అన్నారు. అగ్రకులాల వారి వద్ద ఉన్న డబ్బుకి, అధికారానికి తాను భయపడబోనని అన్నారు. 

  • Loading...

More Telugu News