మురళీ మోహన్: ఈ అవమానాలు తట్టుకోలేక నటులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది: మురళీ మోహన్
- వెబ్‌సైట్లు, యూ ట్యూబ్ ఛానెళ్లలో సినీ ప్రముఖులపై ఫేక్ వార్తలు
- అసభ్యకరంగా ఉంటున్నాయని మురళీ మోహన్ ఆవేదన
- సినిమా వారి జీవితాలు నాశనం అయ్యేట్లు రాతలు ఉంటున్నాయని ఆగ్రహం
సినీ తారల జీవితాలతో ఆడుకోవద్దని సీనియర్ నటుడు, ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... వెబ్‌సైట్లు, యూ ట్యూబ్ ఛానెళ్లలో సినీ ప్రముఖులపై వస్తోన్న ఫేక్ వార్తలపై మండిపడ్డారు. ఎన్నో వెబ్‌సైట్లు, యూ ట్యూబ్ ఛానెళ్లు పుట్టుకొస్తున్నాయని, సినిమా వారే లక్ష్యంగా అభ్యంతరకరంగా వార్తలు రాసి డబ్బులు సంపాదించుకుంటున్నాయని తెలిపారు.
ఇటువంటివన్నీ మానేయాలని, తాము ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని మురళీ మోహన్ చెప్పారు. కొందరు సినిమా ప్రముఖులు తమపై వస్తోన్న అసభ్యకర వార్తల పట్ల తమకు ఫిర్యాదులు చేశారని తెలిపారు. సినిమా వారి జీవితాలు నాశనం అయ్యేట్లు రాతలు ఉంటున్నాయని అన్నారు. అటువంటి వార్తలు రాసేవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అవమానాలు తట్టుకోలేక నటులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకునే పిల్లలు కూడా పాడైపోతున్నారని మురళీ మోహన్ అన్నారు.