నన్నపనేని రాజకుమారి: నాకు చాలా బాధగా ఉంది.. నేను తట్టుకోలేకపోతున్నాను!: కనిగిరి ఘటనపై కన్నీటి పర్యంతమైన నన్నపనేని!
- వీధి కుక్కల్లా, ఊరకుక్కల్లా ప్రవర్తించారు
- సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన ఇది!
- నాకు చాలా బాధగా ఉంది.. తట్టుకోలేకపోతున్నా
- పాత్రికేయులతో నన్నపనేని రాజకుమారి
డిగ్రీ చదువుతున్న అమ్మాయి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. ఈ సంఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ, ‘ఒక వీధి కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా, వేట కుక్కల్లాగా ఆమెపై పడి ఆ విధంగా చేయడం దారుణం.. ముగ్గురు మగోళ్లు కలిసి ఈ దృశ్యాలను వీడియో తీయడమేంటి! ఆ అమ్మాయిపై బలాత్కారం చేయడమేంటి! ఆమె బట్టలను చించేయడమేంటి! ఎటుపోతున్నాం మనం, ఏమవుతున్నాం! క్రూర మృగాల్లాగా, మానవత్వం నశించే విధంగా, నీచాతి నీచమైన ఈ సంఘటనతో సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఉంది.
నాకు చాలా బాధగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి వాళ్లను ఎలా దారిలో పెట్టాలి? ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష వేయాల్సిఉంది. బెయిల్ కూడా ఇవ్వకూడదు. ఈ కేసులను లాయర్స్ కూడా వాదించకూడదు, వకాల్తా పుచ్చుకోకూడదు. చట్టం కూడా చాలా పకడ్బందీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిర్భయ చట్టం ఉన్నా ఇటువంటి వాళ్లు భయపడటం లేదు. మానవుడు దానవుడిగా మారడం మనం చూస్తున్నాం!.. కుక్కలు మనిషి ప్రాణమే తీస్తాయి. కానీ, ప్రాణంతో పాటు మానాన్ని కూడా మనిషి దోచుకుంటున్న సంఘటనలు చూస్తున్నాం. ఈ పరిస్థితికి కారణం ఎవరనే దానిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని రాజకుమారి అన్నారు.
కాగా, బాధిత విద్యార్థినిపై అత్యాచారయత్నం దృశ్యాలను తన మిత్రుల సాయంతో సెల్ ఫోన్ లో రికార్డు చేసిన నిందితుడు కార్తీక్, తాను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనలో కార్తీక్ సహా అతనికి సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.