ప్రధాని మోదీ: తెలుగు రాష్ట్రాల సీఎంలు మోదీకి సలామ్ చేస్తూ గులామ్ అవుతున్నారు: సీపీఐ నారాయణ
* ‘కేంద్రం’ దయాదాక్షిణ్యాలపై ఇద్దరు సీఎంలు
* మోదీ పాలనలో ప్రజలకు మొండిచేయి
* వామపక్ష నేత నారాయణ విమర్శలు
తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోదీకి సలామ్ చేస్తూ గులామ్ అవుతున్నారని సీపీఐ నారాయణ విమర్శించారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై బతుకుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా ప్రజలకు అన్యాయం చేశారంటూ నారాయణ ధ్వజమెత్తారు.
మూడేళ్ల మోదీ పాలనలో ప్రజలకు మొండిచేయి చూపారని ఆరోపించారు. మోదీ ‘మన్ కీ బాత్’ లో ఆయన మనసులో ఒకటి ఉంటుంది, పైకి మరోటి మాట్లాడతారని, ఆయన నోరు మాట్లాడుతుంది, నొసలు ఎక్కిరిస్తాయంటూ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు ప్రకటించిన తర్వాత ఎంత బ్లాక్ మనీ పట్టుకున్నారో బయటకు చెప్పడం లేదని, కొత్త నోట్లు వచ్చిన తర్వాత నల్లధనం ఉండదని, డ్రగ్ మాఫియా ఉండదని మోదీ గతంలో హామీ ఇచ్చారని, కానీ, అవన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు.