‘జై లవ కుశ’: ‘జై లవ కుశ’ సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం!
- ఈ చిత్రం ద్వారా నా అభిమానులు తల ఎత్తుకునేలా చేశానని భావిస్తున్నా
- లేదని భావిస్తే మరో చిత్రం..ఇంకో చిత్రం చేస్తా
- కొత్తగా విడుదలైన చిత్రం ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది
- ప్రేక్షకులను డాక్టర్లతో, విశ్లేషకులను దారినపోయే దానయ్యలతో పోల్చిన జూనియర్ ఎన్టీఆర్
‘జై లవ కుశ’ చిత్రం ద్వారా తన అభిమానులందరిని తల ఎత్తుకునేలా చేశానని తాను భావిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ‘జై లవ కుశ’ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ‘తలఎత్తుకునేలా ఈ చిత్రం లేదని అభిమానులు భావిస్తే కనుక చెప్పండి..ఈ చిత్రం కాకపోతే మరోటి, అదీ కాకపోతే ఇంకోటి.. ఇలా మీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ చిత్రం విజయానికి తోడ్పడ్డ యావత్తు తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ నా కృతఙ్ఞతలు.
ఇంత చెప్పేశాను.. అయినా ఓ చిన్న విషయం ఈ రోజు మాట్లాడాలని అనుకుంటున్నాను. ముందే చెబుతున్నాను.. తప్పుగా మాట్లాడితే క్షమించండి. దీని గురించి పెద్దగా బాధపడకండి. మనం హాస్పిటల్ కు వెళతాం. మనకు సంబంధించిన వ్యక్తి చాలా క్రిటికల్ కండీషన్ లో ఉంటారు. క్రిటికల్ కండీషన్ లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ఎంతో నేర్పు, నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు పేషెంట్ కు చికిత్స చేస్తుంటారు. పేషెంట్ కుటుంబసభ్యులు మాత్రం డాక్టర్లు ఏం చెప్పబోతారోనని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. అంత నైపుణ్యం ఉన్న డాక్టర్లు ‘ఆగండమ్మా, ఒకసారి కరెక్టుగా చెక్ చేయనివ్వండి. పరీక్షలన్నీ చేయనివ్వండి. ఈ పరీక్షల తర్వాత పేషెంట్ పై ఆశలు పెట్టుకోవచ్చా? లేదా? అనే మాటను చెబుతాం’ అని చెబుతారు.
ఆ పేషెంట్ పక్కనే మనం ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటాం. ఈలోపు.. అటుగా వెళ్లి వచ్చే వ్యక్తులు ‘బతకడు.. పోతాడు’, ‘మొన్న మా వాడికి కూడా ఇలానే అయింది. ఛాన్స్ లేదు..పోతాడు’, ఇంపాజిబుల్..అవుట్’ అని అంతా వాళ్లకు తెలిసినట్టే అంటూ ఉంటారు. ఎంతో నేర్పు కలిగినటువంటి వైద్యులు చెప్పనటువంటి మాట వీళ్లు మనకు చెబుతుంటారు!.. వాళ్లు ధైర్యం ఇవ్వకపోగా, చావుబతుకుల్లో ఉన్న వాడిని చంపేయడం, వాడిపై ఆశలు పెట్టుకున్న వాళ్లను ఇంకా చంపేయడం చేస్తుంటారు.
ఇలాంటి ప్రక్రియ ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది. ఒక చిత్రం విడుదలైతే, అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఓ పేషెంట్ లాంటిది. వాడు బతుకుతాడా? చస్తాడా? అనుకునే చుట్టాలం మేము. డాక్టర్లు ప్రేక్షకులు. దారిన పోయే దానయ్యలు కొంతమంది విశ్లేషకులు. అరే, అసలు సినిమా చచ్చిపోయిందో లేదో ప్రేక్షకులు చెబుతారు. అప్పుడు రెడీ. ఆశలు వదులుకుంటాం.. ఒప్పేసుకుంటాం’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం చెందారు.