కోహ్లీ: విరాట్ కోహ్లీ ఎగతాళి: ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్‌ను ఎద్దేవా చేసిన వైనం.. వీడియో వైరల్!
- తొలి వన్డే మ్యాచులో ఘటన
- భువనేశ్వర్ ఎల్బీడబ్ల్యూ కోసం అంపైర్‌కు బౌలర్ అప్పీల్
- అప్పీల్‌ను తిరస్కరించిన అంపైర్
- డీఆర్‌ఎస్ రివ్యూ కోరిన బౌలర్.. భువీ నాటౌట్
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత సారథి విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని ప్రవర్తించిన తీరు ఆసక్తికరంగా ఉంది. హార్థిక్ పాండ్యా ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ 45 వ ఓవర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ మార్కస్ స్టోయినిస్.. భువనేశ్వర్ ఎల్బీడబ్ల్యూ కోసం అంపైర్‌కు అప్పీల్ చేయగా, అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు. అయితే, ఆ బౌలర్ అంతటితో ఊరుకోకుండా డీఆర్‌ఎస్ రివ్యూ (టీవీ రిప్లే) కోరాడు. అయితే, భువీ ఎల్బీడబ్యూ కాలేదని అందులో స్పష్టంగా తేలిపోయింది.
దీంతో ఆస్ట్రేలియా జట్టు రివ్యూ అవకాశాన్ని కోల్పోయింది. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న కోహ్లీ విచిత్రంగా ప్రవర్తించాడు. రివ్యూ కోల్పోయి ఆసీస్ కెప్టెన్ స్మిత్ నిరాశలో పడిపోగా, కోహ్లీ భుజాలను ఎగరేస్తూ, చూపుడు వేలు పైకి ఎత్తి ఔట్.. ఔట్ అంటూ ఎద్దేవా చేశాడు. కోహ్లీ తీరు టీవీలో కనపడగా దాన్ని వీడియో తీసిన రాహుల్ అనే ఓ క్రికెట్ అభిమాని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయిపోతోంది.
కోహ్లీ భలే ఎద్దేవా చేశాడని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్‌గా క్రీజులోంచి వెనుదిగాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని టీమిండియా ఇతర ఆటగాళ్ల బ్యాటింగ్‌ను ఆసక్తిగా చూశాడు. ఈ మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా, ధోనీ శ్రమించి టీమిండియాను ఆదుకుని, భారత్‌కు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.