కేటీఆర్: మహిళలు చీరలు తగులబెట్టడం వెనుక ప్రతిపక్ష పార్టీ నేతల కుట్ర వుంది: కేటీఆర్
- మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు
- చీరలు తగులబెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
- పువ్వును కూడా కిందపడనివ్వని మహిళలు చీరలు తగుల బెడతారా?
ప్రతిపక్ష పార్టీల నేతలకు రాష్ట్రంలో ఏ పనిలేదు కాబట్టి వారు ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 'బతుకమ్మ చీరలు' పేరిట రాష్ట్ర ప్రభుత్వం అందించిన చీరలు ముట్టుకుంటే చిరిగిపోయేట్లు ఉన్నాయని రాష్ట్రంలోని పలుచోట్ల ఈ రోజు మహిళలు ఆ చీరలను తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై ప్రభుత్వంపై విమర్శలు వస్తుండడంతో ఈ రోజు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మహిళలు చీరలను తగుల బెట్టడం వెనుక ప్రతిపక్ష పార్టీ నేతల కుట్ర ఉందన్నారు.
ఉనికి కోసం ప్రయత్నిస్తూ ఇటువంటి పనులు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బతుకమ్మ చీరలు ఇవ్వడం అనేది సంప్రదాయమని చెప్పారు. వారం రోజుల ముందుగానే దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు కుట్రకు ప్లాన్ వేశారని కేటీఆర్ అన్నారు. మొదటి రోజు 25 లక్షల మందికి చీరలు పంచామని కోటి మందికి పైగా మహిళలకు చీరలు పంచుతామని చెప్పారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని చెప్పారు.
చీరలు తగులబెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలందరూ కుట్ర పన్నుతున్నారని చెప్పారు. చీరలు నచ్చకపోతే ఎవ్వరూ తగులబెట్టబోరని వ్యాఖ్యానించారు. పువ్వును కూడా కిందపడనివ్వని మహిళలు చీరలు తగుల బెడతారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలోనే ఈ ఘటనలు జరిగాయని చెప్పారు. రెండు మూడు చోట్ల జరిగిన ఘటనలు రాష్ట్రమంతటా జరిగాయన్నట్లు చేసి చూపొద్దని అన్నారు. తమ పథకాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని చెప్పారు.