: కడప జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి మృతి
- కడప జిల్లా మైలవరం జలాశయం వద్ద ఘటన
- ఆర్థిక ఇబ్బందులే కారణం
- జలాశయంలో మరో ఇద్దరి కోసం గాలింపు
- బాధితులది జమ్మలమడుగు మండలం రాజీవ్‌నగర్ కాలనీ
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మైలవరం జలాశయంలోకి ఐదుగురు వ్యక్తులు దూకేశారని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు ఇప్పటికి ముగ్గురిని వెలికి తీశారు. అయితే, ఆ ముగ్గురు అప్పటికే ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు. వారి పేర్లు షమీమ్ (40), ఆషా (29), మహబూబీ (19) గా పోలీసులు గుర్తించారు.
జలాశయంలోకి దూకిన మరో ఇద్దరు వాహిద్ (42), షబానా (17) కోసం గాలింపు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితులంతా జమ్మలమడుగు మండలం రాజీవ్‌నగర్ కాలనీ వాసులని తెలిపారు. వారు ఈ ఘటనకు పాల్పడడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని చెప్పారు.