: భయంకర ఎన్ కౌంటర్ ఫుటేజ్ ని విడుదల చేసిన న్యూయార్క్ పోలీసులు!
- బొమ్మ తుపాకితో బెదిరించిన జమైకన్
- డమ్మీ ఫిస్టల్ అని తెలుసుకోకుండా కాల్చిన పోలీసులు
- అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు
- ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలనే వీడియో విడుదల చేశామన్న ఉన్నతాధికారులు
అతని పేరు మిగుఎల్ రిచర్డ్స్... అమెరికాలో ఉంటున్న ఓ జమైకన్. అతని చేతిలో పట్టుకున్నది ఓ డమ్మీ తుపాకీ. అయినా అతన్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేయడం వాషింగ్టన్ ప్రాంతంలో కలకలం సృష్టించగా, అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు పోలీసులు ఎన్ కౌంటర్ వీడియోను విడుదల చేశారు. ఘటన వివరాలను పంచుకున్నారు. బ్రాంక్స్ పట్టణంలోని ఎడెన్వాల్ట్ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న రిచర్డ్స్ ఈ నెల 6న విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో ఇంటి యజమాని కంగారుగా పోలీసులకు ఫోన్ చేశారు.
దీంతో అక్కడికి చేరుకున్న ముగ్గురు పోలీసులు, ఓ గదిలో ఉన్న రిచర్డ్స్ ను చుట్టుముట్టారు. అతను కత్తి, గన్ పట్టుకుని అందరినీ బెదిరిస్తున్నాడు. తుపాకీని కింద పడేయాలని ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరించినా వినలేదు. ఇక చేసేదేమీ లేక పోలీసులు అతని శరీరంలోకి బులెట్ల వర్షం కురిపించారు. దాదాపు 44 సార్లు అతన్ని లొంగిపోవాలని కోరినా వినలేదని, మొత్తం 16 బులెట్లు అతని శరీరంలోకి దిగాయని రిచర్డ్స్ స్నేహితుడు వెల్లడించాడు. ఆ తరువాతే అతని చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీ అని తెలిసింది. తన కుమారుడిని కావాలనే చంపేశారని రిచర్డ్స్ తండ్రి ఆరోపించాడు.
కాగా, పోలీసులపై జాతి వివక్ష ఆరోపణలు పెరుగుతూ ఉండటంతో ప్రతి ఒక్క పోలీసుకి బాడీ కెమెరాలు అమర్చుతున్నామని, అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలనే ఈ వీడియోను విడుదల చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు.