: ఇదో రకం నిరసన: వంతెనపై జరిగిన 100వ ప్రమాదం సందర్భంగా.. కేక్ కట్ చేసి అందరికీ పంచిన యువకులు!
పుట్టిన రోజు సమయాల్లో లేదంటే ఏదైనా ఘన విజయం సాధించిన సందర్భాల్లో కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం మామూలే. అయితే, తమిళనాడులోని కేకే నగర్ పాంబన్ రోడ్డు వంతెనపై 100వ ప్రమాదం జరిగిన సందర్భంగా కొందరు యువకులు కేక్ కట్ చేశారు. ఈ విధంగా చేస్తే అయినా ప్రభుత్వం ఈ ప్రమాదాల గురించి పట్టించుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు స్థానిక యువకులు చెప్పారు. ఈ వంతెన రామనాథపురం జిల్లాలోని మండపం బీచ్ ప్రాంతంలో రామేశ్వరాన్ని కలుపుతుంది.
పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవటంతో కొన్ని నెలల క్రితమే రూ. 2 కోట్లతో కొత్తది నిర్మించారు. అయితే, ఆ రోడ్డు నునుపుగా ఉంది. దీంతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోజు మధురై నుంచి రామేశ్వరానికి వెళ్తున్న ప్రభుత్వ బస్సు పాంబన్ వంతెనపై వెళుతూ డివైడర్ను, ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. దీంతో యువకులు ఇలా కేక్ కట్ చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.