: ఒలింపిక్స్ ఆతిథ్యదేశాలు .. 2024లో పారిస్, 2028లో లాస్ఏంజెల్స్!
2024, 2028 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే నగరాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. 2024లో పారిస్ లో, 2028లో లాస్ ఏంజెల్స్ లో నిర్వహించనున్నట్టు తెలిపింది. ఒకేసారి రెండు ఒలింపిక్స్ కు ఆతిథ్య నగరాలను ఐఓసీ ప్రకటించడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. కాగా, పారిస్, లాస్ ఏంజెల్స్ కు గతంలో ఒలింపిక్స్ నిర్వహించిన అనుభవం ఉంది. పారిస్ లో 1900, 1924 ఒలింపిక్స్, లాస్ ఏంజెల్స్ లో 1932, 1984లో నిర్వహించారు.
మరో ఆసక్తికర విషయమేమిటంటే, వందేళ్ల తర్వాత మళ్లీ పారిస్ లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇదిలా ఉండగా, 2024 ఒలింపిక్స్ కోసం పారిస్, లాస్ ఏంజెల్స్ తో పాటు మరో నాలుగు నగరాలు హాంబర్గ్, రోమ్, బుడాపెస్ట్, బోస్టన్ పోటీపడ్డాయి. రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల ఆ నాలుగు నగరాలు పోటీ నుంచి తప్పుకోగా, పారిస్, లాస్ ఏంజెల్స్ మాత్రమే మిగిలాయి.