: లంచం కేసులో పట్టుబడి, అవమానంతో సజీవ దహనం చేసుకున్న ఇంజనీరు!
లంచం తీసుకున్న కేసులో లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి, జైలుకు వెళ్లి, ఆపై బెయిల్ మీద వచ్చి, తీవ్ర అవమాన భారంతో తనకు తాను చితి పేర్చుకుని స్వయంగా నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఇంజనీరు ఉదంతం కర్ణాటకలోని చింతామణి సమీపంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, వంగామాల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి (27) బాగేపల్లి తాలూకా ఉపాధి హామీ పథకంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేశారు.
ఆరు నెలల క్రితం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయి కొద్ది రోజులు జైల్లో గడిపాడు. ఆపై బయటకు వచ్చిన శ్రీనాథ్, ఎవరితోనూ కలవకుండా బాధపడుతూ ఉండేవాడు. చెయ్యని తప్పుకు బలయ్యానని మధనపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తరువాత, ఆ సమీపంలోనే కట్టెలతో చితి పేర్చుకుని, దానిపై పడుకుని, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తెల్లారిన తరువాత ఆ చితిని చూశాకే విషయం తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.