: ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగే లోపే చేజారింది !
ప్రేమికులు తమ ప్రేమను ప్రపోజ్ చేసేందుకు వారికి ఇష్టమైన పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. పార్కు, రెస్టారెంట్ లేదా ఏదైనా పర్యాటక ప్రాంతంలోనో తమ మనసు విప్పి తమ ప్రేమను వెలిబుచ్చుతుంటారు. అమెరికాలోని కాన్సాస్ కు చెందిన సేత్ డిక్సన్ కూడా ఇదే తరహాలో తన ప్రేయసి రూత్ సలాస్ కి తన ప్రేమ విషయం చెబుదామనుకున్నాడు. ఓ శుభముహూర్తం చూసిన డిక్సన్, కాన్సాస్ సిటీలోని లూస్ పార్క్ కు రమ్మనమని రూత్ సలాస్ కు చెప్పాడు.
అక్కడ వాళ్లిద్దరూ కలుసుకోవడం, ఆ పార్క్ లో ఉన్న ఓ చెక్క వంతెనపైకి చేరడం జరిగింది. అదే సరైన సమయమని భావించిన డిక్సన్, హీరో స్టైల్ లో మోకాలిపై కూర్చుని తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాడు. అందుకు సలాస్ ‘ఓకే’ చెప్పడంతో ఉబ్బితబ్బిబై పోయాడు. తాను ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న సుమారు మూడు వేల డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన ఉంగరాన్ని ఆమె చేతి వేలికి తొడుగుదామని చెప్పి, ఆ బాక్స్ ఓపెన్ చేసి తీయబోయాడు.
అంతే... ఉంగరం చేజారింది.. వంతెనపై నుంచి జారి కింద కాలువలో పడింది. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన డిక్సన్, వెంటనే, తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అంతే!, సుమారు 25 మంది మిత్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ కాలువలోకి దిగి.. పోయిన ఉంగరం కోసం గాలించారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చేసేదేమీ లేక, డిక్సన్- సలాస్ ప్రేమజంట సహా మిత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, వచ్చే నెల 21న పెళ్లి చేసుకోనున్న ఈ జంటకు వారి స్నేహితులే ఉంగరం కొనివ్వాలని నిశ్చయించుకున్నారట.