: ఆ బాలికను సాయికిరణ్ హత్య చేయడానికి కారణం 'ఇదే' అంటూ ఏ ఒక్క అంశాన్నీ చెప్పలేం!: పోలీసులు
చాందిని హత్య కేసులో విచారణ ఇంకా పూర్తిగా జరగలేదని, మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. సాయికిరణ్, చాందినితో పాటు వారి స్నేహితుల ల్యాప్‌టాప్‌లు, కాల్స్ డేటా, సోషల్ మీడియాను పరిశీలిస్తున్నామని తెలిపారు. సాయికిరణ్ ఈ హత్య చేయడానికి కారణం ఇదే అంటూ ఏ ఒక్క అంశాన్ని చెప్పలేమని తెలిపారు. ఈ హత్యకు ఎన్నో కారణాలు ఉన్నాయని తమకు తెలుస్తోందని చెప్పారు. చాందిని, సాయికిరణ్ ఆ రోజు ఇద్దరూ ఆటోలో అమీన్ పూర్ గుట్టకి వెళ్లారని చెప్పారు.
పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే అలా చేశానని, నిందితుడు చెబుతున్నాడని, అతడిని కస్టడీలోకి తీసుకుని మళ్లీ విచారించాల్సి ఉందని, మరిన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు అన్నారు. సాయికిరణ్ కొన్ని విషయాలు దాస్తున్నట్టు వుందని తాము అనుకుంటున్నట్లు తెలిపారు. సాయికిరణ్, చాందిని మధ్య ఈ మధ్యే సాహిల్ అనే యువకుడు కూడా ఎంటరయ్యాడని తమకు తెలిసిందని చెప్పారు. చాందినిని చంపిన తరువాత సాయికిరణ్ ఆ గుట్టలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడో తెలియాల్సి ఉందని అన్నారు. సీసీ ఫుటేజీని ఇంకా పరిశీలిస్తున్నామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని అన్నారు.