: ఫాదర్ టామ్‌ను విడిపించడానికి ఎలాంటి డబ్బు చెల్లించలేదు... స్పష్టం చేసిన కేంద్ర మంత్రి వీకే సింగ్
ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల బారి నుంచి కేరళకు చెందిన కాథలిక్ మతాధిపతి ఫాదర్ టామ్ ఉళున్ననిల్‌ను విడిపించడానికి ఎలాంటి డబ్బు చెల్లించలేదని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. ఫాదర్ టామ్‌ను విడిపించడం కోసం కోటి అమెరికన్ డాలర్లు చెల్లించినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ద్వైపాక్షిక చర్చలు, మంతనాల ద్వారానే ఫాదర్ టామ్‌ను సురక్షితంగా కాపాడగలిగామని ఆయన తెలియజేశారు.
అయినా తీవ్రవాదులకు వారు అడిగినంత డబ్బు చెల్లించి, విడిపించుకునే పాలసీ అంటూ మనకు ఏమీ లేదని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా ఫాదర్ టామ్ కోసం ఒమన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు చేశామని, వాటి ఫలితంగానే టామ్‌ను మిలిటెంట్ల చెర నుంచి విడిపించగలిగామని తెలిపారు. అయితే ఫాదర్ టామ్‌ను ఏ విధంగా రక్షించారనే విషయాలపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అది జాతీయ రక్షణ రహస్యాలకు సంబంధించిన అంశమని చెప్పారు. ప్రస్తుతం ఫాదర్ టామ్ వాటికన్ సిటీ పోప్‌ను కలవడానికి వెళ్లినట్లు సమాచారం.