: పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐని లెంపలు వాయించిన మహిళా న్యాయమూర్తి... వీడియో!
తాను యూపీలో న్యాయమూర్తినని, తన కుమారుడినే అరెస్ట్ చేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, పోలీస్ స్టేషన్ లో ఓ అధికారిని లెంపలు వాయిస్తున్న జయాపాఠక్ అనే మహిళ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెహ్రాడూన్ లోని ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి ఓ ప్రైవేటు వర్శిటీలో చదువుతున్న ఆమె కుమారుడు, మరికొందరితో ఘర్షణకు దిగాడు. కేసు పోలీసుల గడప తొక్కగా, వారందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, వారి తల్లిదండ్రులను పిలిపించారు.
దీంతో స్టేషన్ కు వచ్చిన జయా పాఠక్, పోలీసులతో గొడవకు దిగారు. తాను జిల్లా అడిషనల్ న్యాయమూర్తినని అంటూ రెచ్చిపోయారు. ఆమె దూషణ పర్వాన్ని వీడియో తీయబోగా, రెచ్చిపోయి ఆయనపై చెయ్యి చేసుకున్నారు. "మీరు న్యాయమూర్తినని చెబుతున్నారు.. ఇలా ప్రవర్తించడం భావ్యమేనా? మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటుండటం కూడా వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వ్యవహారాన్ని జనరల్ డైరీలో రాసిన పోలీసులు, ఆమె జడ్జిగా పని చేస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు. అదే నిజమైతే అలహాబాద్ హైకోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, తప్పయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.