: పార్టీలో ఒక్క నాయకుడు కూడా మిగిలే పరిస్థితి లేదు!: దిగ్విజయ్ కు స్పష్టం చేసిన ఏపీ కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు ఏపీ కాంగ్రెస్ నేతలు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే... సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం ఎదుర్కోవడంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా, ఏపీలో పార్టీ కొంతవరకైనా బలపడకపోతే, పార్టీలో ఒక్క నాయకుడు కూడా మిగిలే పరిస్థిితి లేదని దిగ్విజయ్ కు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈ రెండు ఎన్నికల్లో ఘోర ఓటమిపై సోనియాగాంధీ సీరియస్ గా ఉన్నారంటూ నేతల వద్ద దిగ్విజయ్ అన్నారు. దీనికి సమాధానంగా డిగ్గీరాజాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు కాంగ్రెస్ నేతలు.
మరోవైపు, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తనదే అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకు ఓసారి ముఖ్య నేతలంతా ఢిల్లీకి రావాలని దిగ్విజయ్ సూచించారు. ఈ సమావేశానికి కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సి.రామచంద్రయ్య, కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.