: బుట్టడు సమోసాలు, బన్ లు కొని తలా ఒకటి పంచిపెట్టిన ఎమ్మెల్యే యరపతినేని!
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మండలం కోనంకిలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహించిన పర్యటన ఆసక్తికరంగా సాగింది. కాలినడకన ఆయన తిరుగుతున్న వేళ, 70 ఏళ్ల వృద్ధురాలు పురం పిచ్చమ్మ ఓ బుట్టలో సమోసాలు, బన్ లు పెట్టుకుని అమ్ముకుంటూ కనిపించింది. ఆమెను చూసిన యరపతినేని, "అవ్వా నీ దగ్గర ఏమున్నాయి?" అంటూ అడిగారు.
దీనికామె, తన వద్ద సమోసాలు, నాన్ రొట్టెలు ఉన్నాయని, వీటినే అమ్ముకుని బతుకుతున్నానని సమాధానం ఇచ్చింది. దీంతో ఎండ ఎక్కువగా ఉందని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ఎండలో నువ్వెక్కడ అమ్ముతావులే... అంటూ మొత్తం సమోసాలు, రొట్టెలు తీసుకుని ఆమెకు రూ. 2 వేలు ఇచ్చారు. ఆపై వాటన్నింటినీ చుట్టూ ఉన్న పార్టీ నేతలకు, కార్యకర్తలకూ పంచారు. తన సరుకు మొత్తం రూ. 300 వరకూ విలువ ఉంటుందని, వాటికి రూ. 2 వేలు ఇవ్వడంతో తనకెంతో సంతోషంగా ఉందని పిచ్చమ్మ వ్యాఖ్యానించింది.