: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి విద్యాసంస్థల్లో తెలుగు తప్పనిసరి బోధన!
ప్రపంచ తెలుగు మహాసభలపై ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను కచ్చితంగా బోధించాల్సిందేనన్నారు. తెలుగు బోధించే పాఠశాలలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
* ఇక నుంచి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదు
* ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఆ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండాలి.
* ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్‌లలో బోధించే తెలుగు సబ్జెక్టులకు సిలబస్ రూపొందించాల్సిందిగా సాహిత్య అకాడమీకి ఆదేశం.
* రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై బోర్డులు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలి.
* రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి మహాసభల్లో చర్చాగోష్ఠుల నిర్వహణ
* ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి తదితర ప్రదర్శనలు, కలుపు పాట, నాటుపాట, బతుకమ్మ పాటలు వంటి వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* తెలుగు భాషాభివృద్ధి, వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీవేత్తలు, కళాకారులకు సన్మానం.