: విడాకుల విషయంలో సుప్రీం కీలక తీర్పు.. ఆరు నెలల కూలింగ్ పిరియడ్ అక్కర్లేదని స్పష్టీకరణ!
విడాకుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యాభర్తలు విడిపోతామని నిర్ణయించుకున్నాక, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించే అవకాశం లేనప్పుడు ఆరు నెలల కూలింగ్ పిరియడ్ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదని, ట్రయల్ కోర్టులు వారికి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. 8 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్న ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేస్తూ ఆరు నెలల కూలింగ్ పిరియడ్‌ను సవరించి విడాకులు మంజూరు చేయల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
నిజానికి 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల కోసం దరఖాస్తు చేసిన ఆరు నెలల వరకు డైవోర్స్ మంజూరు చేయడానికి వీల్లేదు. దరఖాస్తుదారుల మనసులు మారే అవకాశం ఉండడంతో చట్టంలోని 13బి (2) సెక్షన్ ఆరు నెలల పాటు కూలింగ్ పిరియడ్‌ను పేర్కొంది. అయితే దంపతులు తాము ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండే అవకాశం లేదని బలంగా భావిస్తే ఈ నిబంధనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. కాబట్టి ఆ ఆరు నెలల కాల వ్యవధిని సడలించి విడాకులు మంజూరు చేసే అవకాశం ట్రయల్ కోర్టులకు ఉందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.