: గౌతం గంభీర్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న టోర్నీకి మోకాలడ్డిన బీసీసీఐ
దుబాయ్ లో ఈనెల 19 నుంచి 29 వరకు జరగనున్న ఇండియన్ జూనియర్ ప్లేయర్స్ లీగ్ (ఐజేపీఎల్)కు బీసీసీఐ మోకాలడ్డింది. ఈ టోర్నీ లాంచింగ్ ఈవెంట్ లో నిర్వాహకులు ఐసీసీ లోగోను కూడా వాడారు. అయినప్పటికీ ఇందులో ఆడటానికి అండర్ -16, అండర్-19 ప్లేయర్లకు బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు, అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు లేఖ కూడా రాసింది. ఇండియన్ జూనియర్ ప్లేయర్స్ లీగ్, ఇండియన్ జూనియర్ ప్రీమియర్ లీగ్ లను బీసీసీఐ అప్రూవ్ చేయలేదని లేఖలో పేర్కొంది. అందువల్ల... మీ అసోసియేషన్లలో నమోదైన ప్లేయర్లు ఈ టోర్నీల్లో పాల్గొనకుండా చూడాలని సూచించింది. మరోవైపు, భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐజేపీఎల్ టోర్నీకి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ సందర్భంగా ఒక రాష్ట్ర అసోసియేషన్ కు చెందిన సెక్రటరీ మాట్లాడుతూ, అండర్-16, అండర్-19 ప్లేయర్ల డేటా బేస్ తమ వద్ద ఉంటుందని... ఎవరైనా బీసీసీఐ ఉత్తర్వులను ఉల్లంఘించి టోర్నీలో ఆడితే... వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని తెలిపారు. అంతేకాదు, అలాంటి వారికి భవిష్యత్తులో బీసీసీఐ తరపున ఆడే అవకాశం కూడా ఉండకపోవచ్చని చెప్పారు.