: నా దేశం ఇంతే... అభిషేక్ బచ్చన్, ముఖేష్ అంబానీలను ప్రస్తావిస్తూ, వారసత్వంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు!
ఇండియాలో బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, అన్ని రంగాల్లో వారసత్వం కొనసాగుతోందని చెప్పారు. సినీ రంగంలో అభిషేక్ బచ్చన్, వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ పేర్లను ప్రస్తావించిన ఆయన, ఇదో సమస్యేనని, అయితే, ఇండియాలో అధికంగా జరిగేది ఇదేనని చెప్పారు.
"అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే జరుగుతోంది. ఇండియాలో ఇది సర్వసాధారణం. కాబట్టి కేవలం నా వెనుకే పడవద్దు. అఖిలేష్ యాదవ్, స్టాలిన్ వంటి వారెందరో ఉన్నారు. కేవలం నా పేరు మాత్రమే రాజకీయ వారసత్వ చర్చల్లో వాడవద్దు. అభిషేక్ బచ్చన్, ముఖేష్ అంబానీ కూడా వారి వారి రంగాల్లో వారసులే, ఇండియాలో ఇదే జరుగుతుంది" అని ఆయన అన్నారు.
"ఇండియాలో ఓ బీజేపీ యంత్రం ఉంది. దాని ముందు 1000 మంది కూర్చుని నిత్యమూ కంప్యూటర్ల ద్వారా నా గురించి మీకు చెబుతుంటారు. అదో అద్భుత యంత్రం. నిత్యమూ నాపై దుష్ప్రచారమే దానికి పని. నేనో విఫలమైన రాజకీయ నాయకుడినని, స్టూపిడ్ నని ప్రచారం చేస్తున్నారు. దేశాన్ని నడుపుతున్న ఓ జంటిల్ మన్ దీన్ని కూడా నిర్వహిస్తున్నారు" అని ప్రధాని నరేంద్ర మోదీ పేరును చెప్పకుండా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
తనకన్నా, మోదీ మంచి వక్తని చెప్పిన రాహుల్ గాంధీ, ఒక సమూహంలోని మూడు నాలుగు వేర్వేరు వర్గాల వారికి నప్పేలా సందేశాన్ని ఇచ్చే సత్తా ఆయనకుందని, పైపై మెరుగులను మాత్రమే ఆయన ప్రచారం చేసుకుంటున్నారని, తాము మాత్రం క్షేత్ర స్థాయిలో పని చేస్తూ వెళుతున్నామని అన్నారు. తాను 9 సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్, చిదంబరం, జైరాం రమేష్ వంటి వారి మార్గదర్శకత్వంలో పని చేశానని చెప్పారు. 2013లో తమ ప్రభుత్వమే ఉగ్రవాదుల వెన్ను విరిచిందని, 2013 సంవత్సరంలో తాము చేపట్టిన చర్యలతోనే కాశ్మీర్ లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిందని, ఇప్పుడు మోదీ అదంతా తమ ఘనతని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.