: 30 గంటల పాటు ఈల వేస్తూ పాటలు పాడిన యువతి... గిన్నిస్ రికార్డు!
చెన్నైకి చెందిన పూజ చంద్రమోహన్ 30 గంటల పాటు నోటితో ఈల వేస్తూ పాటలను పాడి గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతంలో కెనడాకు చెందిన జెన్నిఫర్ అనావీ డేవిస్ పేరున ఉన్న 25గం. 30ని. 5 సెకన్ల ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 9, ఉదయం 9 గం.లకు ప్రారంభమైన పూజ ప్రదర్శన సెప్టెంబర్ 10, మధ్యాహ్నం 3గం.ల వరకు కొనసాగింది. ఈల వేయడంలో శిక్షణ పొందిన పూజ తమిళం, హిందీ, ఇంగ్లిష్, కొరియన్ భాషల పాటలను ఈల వేస్తూ పాడి, కార్యక్రమానికి వచ్చిన వారిని ఆకట్టుకుంది.
ఆమె దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలోని `డోలీ సజాకే రఖ్ నా` పాట ఈల ద్వారా పాడుతున్నపుడు అక్కడ ఉన్న వాళ్లు లేచి స్టెప్పులు వేశారు. ప్రదర్శన మొదట్లో చూపించిన ఉత్సాహాన్ని ఆమె చివరి వరకు కొనసాగించిందని కార్యక్రమానికి హాజరైన ప్రముఖ గాయని ఎస్పీ శైలజ తెలిపారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వారికి పంపించినట్లు పూజ శిక్షకుడు రజత్ తర్కాస్ చెప్పాడు.