: శశికళ బర్తరఫ్ పై దినకరన్ స్పందన ఇది!
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించే అధికారం ఎవరికీ లేదని ఆ పార్టీ వ్యతిరేక వర్గం నేత టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. నేడు జరిగిన సర్వసభ్య సమావేశంలో శశికళను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత మీడియాతో మాట్లాడిన దినకరన్, పార్టీ తమదేనని, శశికళను తొలగించడం ఎవరివల్లా కాదని అన్నారు.
ఎటువంటి గుర్తింపూ లేని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ చేసిన తీర్మానాలేవీ చెల్లవని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని అన్నారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి ఎన్నటికీ జయలలితేనని, ఆమె ప్రతినిధిగా మాత్రమే శశికళ వ్యవహరిస్తూ వచ్చారని చెప్పిన దినకరన్, తన భవిష్యత్ నిర్ణయంపై మాత్రం మాట దాటవేశారు. పార్టీ నేతలంతా లేకుండా జరిగిన సమావేశం చెల్లదని అన్నారు. కాగా, అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి దినకరన్ వర్గంలోని 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైన సంగతి తెలిసిందే.