: ముస్లింల ర్యాలీకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డికి చేదు అనుభవం!


చిత్తూరు జిల్లా మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, మయన్మార్ లో ముస్లింల ఊచకోత నేపథ్యంలో పట్టణంలో ముస్లింలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొనేందుకు తిప్పారెడ్డి అక్కడకు వచ్చారు. దీంతో, ఆయనను అడ్డుకున్న ముస్లింలు వైసీపీకి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీని కేవలం మత పరంగానే నిర్వహిస్తున్నామని... ఇందులో రాజకీయ నేతలకు స్థానం లేదంటూ ఆయనకు చెప్పారు. ఈ ర్యాలీని రాజకీయం చేయడానికి తాము ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో, దేశాయ్ తిప్పారెడ్డి అక్కడ నుంచి వెనుదిరిగారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, మయన్మార్ లో రోహింగ్యా ముస్లింలను పాశవికంగా చంపేస్తున్నారని... శవాలను సైతం ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి క్రూరులను అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా శిక్షించాలని డిమాండ్ చేశారు. మయన్మార్ లో పర్యటించిన ప్రధాని మోదీ... ఈ ఊచకోతపై నోరు మెదపకపోవడం బాధను కలిగించిందని చెప్పారు. ఇమామ్ హఫీజ్ సైఫుల్లా మాట్లాడుతూ, ఈ ఊచకోతను ఆపడానికి ప్రధాని మోదీ మయన్మార్ ప్రభుత్వంతో మాట్లాడాలని అన్నారు. అనంతరం వీరు సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.

  • Loading...

More Telugu News