: ఇలాంటి మతి స్థిమితం లేని వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు!: జగన్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు!
వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మానసిక స్థితి బాగోలేదని... మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి పాటుపడుతున్నది కేవలం టీడీపీనే అని, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది వైసీపీ అని విమర్శించారు. ఏపీ ప్రజలకు వైసీపీ అవసరం లేదని చెప్పారు. ఏమాత్రం అనుభవం లేని, చేతకాని ప్రతిపక్ష నేత జగన్ అని అన్నారు. తనను ఉరి తీయాలని, బట్టలు ఊడతీయాలని నంద్యాల ఎన్నికల సమయంలో జగన్ అన్నారని... తాను ఏం తప్పు చేశానని ప్రశ్నించారు.
ఎన్నోసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని... అయినా, ప్రజలు ఎంతో విజ్ఞతతో వ్యవహరించారని కితాబిచ్చారు. చివరకు జగన్ ను ఎన్నికల కమిషన్ కూడా హెచ్చరించిందని... అయినా, అతనిలో ఏమాత్రం మార్పు రాలేదని మండిపడ్డారు. ఇలాంటి మతి స్థిమితం లేని వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని అన్నారు. ప్రజలను కుల, మతాల వారిగా విడదీసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని... వీరి కుట్రలను ప్రజలు గమనించాలని సూచించారు. వైసీపీలో ఉన్నవారంతా దొంగలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తాత్కాలిక పార్టీనే అని, ఆ పార్టీ ఎన్నో రోజులు ఉండదని చెప్పారు.