: అలలు ఎగసిపడొచ్చు...ఇళ్లలోనే ఉండండి.. అల్పపీడనంతో వర్షాలు ముంచెత్తుతాయి: ఫ్లోరిడా గవర్నర్
ఇర్మా హరికేన్ తీవ్రత తగ్గింది. గాలుల వేగం కూడా తగ్గింది. 112 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. హరికేన్ ఉత్తర ఫ్లోరిడా, దక్షిణ జార్జియా వైపుగా ముందుకు కదులుతూ మరింత బలహీనపడి జార్జియా, అలబామా, మిస్సిసిపీ, టెన్నెసీ రాష్ట్రాల దిశగా మరలి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీరాన్ని పూర్తిగా దాటేకొద్దీ సముద్ర తీరాన్ని భారీ అలలు ముంచెత్తుతాయని, తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఫ్లోరిడాకు ఇంకా ముప్పు తొలగిపోలేదని గవర్నర్ రిక్ స్కాట్ హెచ్చరించారు. తుపాను కారణంగా వర్షాలు ముంచెత్తవచ్చని, పల్లపు ప్రాంతాల్లో 6 అంగుళాల మేర నీరు చేరే అవకాశం ఉందని, అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముప్పు ఇంకా పూర్తిగా తొలగకపోవడంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని ఆయన సూచించారు. జార్జియా వైపు కదిలిన ఇర్మా కారణంగా ఆ రాష్ట్రంలో లక్ష మందిని విద్యుత్ సమస్య చుట్టుముట్టింది.