: రోడ్డున పడ్డ 80,000 మంది తెలుగు కార్మికులు... సౌదీలో తెలుగు కార్మికుల వెతలు
సౌదీఅరేబియాలో తెలుగు కార్మికులను తీవ్రమైన కష్టాలు చుట్టుముట్టాయి. సౌదీ చట్టాల ప్రకారం కంపెనీలన్నీ విదేశీ కార్మికుల భారాన్ని తగ్గించుకున్నాయి. 14 శాతం కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. దీంతో సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల్లో పని చేసిన సుమారు 80,000 మంది తెలుగు కార్మికులు నిరుద్యోగులుగా మారారు. కష్టమో, నష్టమో స్వదేశం చేరుదామని భావించిన వారికి విధుల నుంచి తొలగించిన కంపెనీల యాజమాన్యం పాస్ పోర్టులు, వీసాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.
విధుల్లో చేరే సమయంలో కార్మికులు నోరెత్తకుండా ఉండేందుకు యాజమానులు తీసుకున్న పాస్ పోర్టులు తిరిగి ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గత మూడు నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొందరు వీధి కుళాయిల వద్ద నీరుతాగి జీవనం చేస్తున్నట్టు స్నేహితుల ఫోన్ ల నుంచి వీడియో మెసేజ్ లు పెడుతున్నారు. తమకు ఎవరో ఒకరు స్నేహహస్తం అందించాలని కోరుతున్నారు.