: పోలీసుల అదుపులో డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్?
డేరా బాబా దత్తపుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ పోలీసులకు పట్టుబడినట్టు తెలుస్తోంది. డేరా బాబా ముసుగు వేసుకుని అంతులేని అక్రమాలకు పాల్పడిన గుర్మీత్ రాం రహీం సింగ్ ను శిక్ష పడిన అనంతరం తప్పించేందుకు ప్లాన్ వేసిందని, ఆ తరువాత పరారైందని ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. డేరా బాబాకు శిక్ష పడిన వెంటనే ఆయనకు ప్రతిరోజూ మసాజ్ చేయాలని, బాబాకు మసాజ్ చేసేందుకు తనను అనుమతించాలని, జైలులో ఆయన సేవ చేసి తరిస్తానని న్యాయస్థానానికి విన్నవించిన హనీ ప్రీత్... తదనంతర పరిణామాల నేపథ్యంలో పరారీలో ఉంది.
ఈ క్రమంలో ముంబైలో తలదాచుకున్న ఆమెను పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. అయితే హర్యానా తీసుకెళ్లిన తరువాత మీడియాకు వెల్లడించాలనే ఉద్దేశంతోనే ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆమెను విచారించడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.