: ‘ఇన్ఫోసిస్’లో వచ్చే రెండేళ్లలో కొత్త ఉద్యోగాలు
వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికి పైగా కొత్త ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ఐటీ దిగ్గజ సంస్థ ‘ఇన్ఫోసిస్’ తాత్కాలిక సీఈఓ, ఎండీ యూబీ ప్రవీణ్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ వీసాలకు సంబంధించిన వివాదాలు ఉన్నప్పటికీ, యూఎస్, యూరోపియన్ మార్కెట్లో ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగించనున్నామని, నియామక ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు.
వచ్చే రెండేళ్లలో కొత్త ఉద్యోగాల నియామకాలు ఉంటాయని, అయితే, కంపెనీ వృద్ధి మేరకు ఈ నియామకాలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఏటా పది లక్షల మంది గ్రాడ్యుయేట్స్ విశ్వ విద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారని, అయితే, వీరిలో కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మంది మాత్రమే ప్రతిభ కలిగిన వారు ఉంటారని అన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం తమతో పాటు ఇతర కంపెనీలు పోటీపడతాయని చెప్పారు. కాగా, ‘ఇన్ఫోసిస్’ ఇటీవల కాలంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.