: చైనాకు మరో షాకిచ్చిన భారత్.. ఉక్కు దిగుమతులపై ఐదేళ్లపాటు అదనపు సుంకం వసూలు
చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. చైనా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న వాటిలో వందకుపైగా వస్తువులపై దిగుమతి నిరోధక సుంకాన్ని విధించిన భారత్.. తాజాగా ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులపై అదనంగా 18.95 శాతం సుంకాన్ని విధించింది. ఈ సుంకాన్ని ఐదేళ్లపాటు వసూలు చేస్తారు. దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న చవక ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటి ప్రభావం దేశీయ మార్కెట్‌పై తీవ్రంగా ఉంటోందని ప్రభుత్వం పేర్కొంది.
తాజా నిర్ణయం దేశీయ మార్కెట్‌కు ఊపు తెస్తుందని భావిస్తున్నట్టు వివరించింది. భారత్ ఇది వరకే చైనా, జపాన్, దక్షిణ కొరియా నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులపై దిగుమతి నిరోధక సుంకం విధించింది. ఇప్పుడు దానికి అదనంగా మరింత సుంకాన్ని జోడించింది. కాగా, చైనా, భారత్ నుంచి తమ దేశంలోకి దిగుమతి అవుతున్న సబ్సిడీ స్టీల్ ఫ్లాంజ్‌లపై అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ దర్యాప్తునకు ఆదేశించింది.