: పవన్ కల్యాణ్ ది హాఫ్ నాలెడ్జ్.. జీవో 64 రద్దుపై ఆయనకు ఎవరు తప్పుడు సలహా ఇచ్చారో!: మండిపడ్డ మహేశ్ కత్తి
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు తనను టార్చర్ చేస్తున్నారంటూ ఇటీవలే మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన మహేశ్ కత్తి ఈ రోజు పవన్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు, పదోన్నతులకు సంబంధించిన జీవో నెంబరు 64ను ఏపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ జీవోను రద్దు చేయాలని అంతకు రెండు రోజుల ముందే పవన్ కల్యాణ్ సర్కారుని కోరాడు.
దీంతో వ్యవసాయ పట్టభద్రుల సంఘం పవన్ కల్యాణ్‌పై మండిపడుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది. పవన్ తమ జీవితాలతో ఆడుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తను న్యూస్ పేపర్‌లో చూసిన మహేశ్ కత్తి... హాఫ్ నాలెడ్జ్ ఎల్లప్పుడూ ప్రమాదమేనని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. పవన్ కల్యాణ్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఆయనకు ఎవరు సలహా ఇచ్చారో తనకు తెలియట్లేదని మహేశ్ కత్తి ఎద్దేవా చేశాడు. ఈ సందర్భంగా వ్యవసాయ పట్టభద్రుల సంఘం ధర్నా చేస్తోన్న వార్తను ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.