: అంటార్కిటికా కింద మరో ప్రపంచం.. రహస్య జీవులు?
పూర్తిగా మంచుతో నిండి ఉన్న అంటార్కిటికా కింద వేల కొద్దీ అగ్నిపర్వతాలున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అగ్నిపర్వతాలే కాకుండా కొన్ని అపరిచిత జీవులతో నిండి ఉన్న ప్రపంచం కూడా అంటార్కిటికా మంచు దుప్పటి కింద ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచు కింద ఉన్న అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుహలు ఏర్పడ్డాయని, వాటిల్లో మనుషులకు అంతుచిక్కని జీవజాలం అభివృద్ధి చెంది ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆ గుహల్లో ఉన్న వెచ్చదనం జీవుల మనుగడకు, సంతానోత్పత్తికి కావాల్సినంత ఉండడంతో జీవజాలం కచ్చితంగా ఇక్కడ నివసించి ఉండవచ్చని వారు తెలిపారు.
అక్కడి రోస్ ద్వీపం వద్ద ఎరెబస్ పర్వతం పరిసరాల్లో ఇలాంటి గుహలు శాస్త్రవేత్తలకు తారసపడ్డాయి. అక్కడి మట్టి నమూనాలను పరీక్షించిన వారికి మొక్కలు, జంతువుల డీఎన్ఏను పోలిన డీఎన్ఏ కనిపించింది. దీంతో ఈ ప్రాంతాల్లో రహస్య జీవులు ఉన్నట్లుగా వారు అంచనా వేశారు. దీంతో శాస్త్రవేత్తలు అవి జీవించి ఉన్నాయా? వాటి ప్రత్యేకతలేంటి? వంటి విషయాలను పరిశోధించడంపై దృష్టిసారించారు. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెడతామని పరిశోధకుడు ఫ్రాసెర్ పోలార్ తెలిపారు.