: ఇది డేరా బాబా 'బిగ్ బాస్ రియాలిటీ షో'... హనీ సింగ్, ఆమె భర్త కూడా కంటెస్టెంట్సే!
డేరా బాబా ముసుగులో వ్యక్తిగత కాంక్షలు తీర్చుకున్న గుర్మీత్ రాం రహీం సింగ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇద్దరు సాధ్వీల రేప్ కేసులో 20 సంవత్సరాల జైలుశిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ దారుణాలు వివరించేందుకు ఇప్పుడిప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు. డేరా బాబా అభిరుచుల్లో 'బిగ్ బాస్ షో' కూడా ఉందని ఆయన మాజీ భక్తుడు గురుదాస్ తూర్ తెలిపారు. ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బిగ్ బాస్ షోను బాబా నిర్వహించాడని తెలిపాడు. నెల రోజులపాటు ఈ షో జరుగుతుంది.
డేరా బిగ్ బాస్ షోలోకి ఎవరు వెళ్లాలి, ఎవరు షో నుంచి నిష్క్రమించాలి? అన్న వివరాలన్నీ గుర్మీత్ ఆదేశానుసారమే జరిగేదని అన్నారు. ఇందు కోసం అద్భుతమైన భవనం నిర్మించాడని, ఈ ఇంట్లో పలు కోణాల్లో సీసీటీవీ కెమెరాలు ఉండేవని తెలిపాడు. హనీ ప్రీత్ ఇన్సాన్, ఆమె మాజీ భర్త గుప్తా కూడా ఈ రియాలిటీ షో కంటెస్టెంట్సేనని ఆయన వెల్లడించారు. ఈ షో హోస్ట్, జడ్జి గుర్మీతేనని ఆయన తెలిపారు. కంటెస్టెంట్స్ అందరికీ రూల్స్ ఉండేవని, హనీ ప్రీత్ కు మాత్రం రూల్స్ తో సంబంధం లేదని ఆయన వెల్లడించారు.