: క్రికెట్‌లో తాను ఇంకెన్నేళ్లు కొనసాగేదీ చెప్పేసిన టీమిండియా సారథి కోహ్లీ!


క్రికెట్‌లో తాను ఇంకెంతకాలం కొనసాగేది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పేశాడు. తాను కనుక ఫిట్‌గా ఉంటే మరో పదేళ్లు తన కెరియర్‌ను కొనసాగిస్తానని పేర్కొన్నాడు. మరో రెండు నెలల్లో 29వ ఏట అడుగుపెడుతున్న ఆయన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ తమలో చాలామందికి ఈ కెరియర్‌లో ఎంతకాలం కొనసాగుతామన్న విషయంలో స్పష్టత ఉండదన్నాడు. తన వరకు వస్తే ఇప్పటి కంటే మరింత కఠినంగా శిక్షణ తీసుకుంటే మరో పదేళ్లు కొనసాగే అవకాశం ఉందన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 60 టెస్టుల్లో 4658 పరుగులు చేశాడు. 194 వన్డేల్లో 8587 పరుగులు పూర్తి చేశాడు.

కాగా, ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూపుతో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ (వీకేఎఫ్) చేతులు కలిపింది. క్షేత్రస్థాయిలో ఎవరైతే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తారో అటువంటి వారికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి ఏడాది రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే అథ్లెట్ల ప్రదర్శన బట్టి ఈ మొత్తం పెరుగుతుందని కోహ్లీ పేర్కొన్నాడు. క్రికెట్ లేకుండా తానేమీ చేయలేనని, ఈ రోజు తానిలా ఉండడానికి అదే కారణమని పేర్కొన్నాడు. ఇప్పుడు తనకున్న దానితో ప్రజలకు కొంత చేయగలిగితే అంతకుమించిన భాగ్యం మరోటి ఉండదన్నాడు. ఈ కార్యక్రమానికి హాజరైన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. ఆయన సాధించిన విజయానికి గర్విస్తున్నట్టు చెప్పాడు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వంటి ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్లను భారత్‌కు అందిస్తున్నాడని కొనియాడాడు.

  • Loading...

More Telugu News