: యూట్యూబ్ చానెళ్ల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు.. హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్!


యూట్యూబ్ చానళ్ల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మీడియా ముసుగులో విధ్వంసం సృష్టించేందుకు ఆ శక్తులు సిద్ధమవుతున్నట్టు హెచ్చరికలు జారీ చేసింది. యూట్యూబ్ చానల్ ప్రారంభించేందుకు పెద్దగా శ్రమలేకపోవడం, ప్రభుత్వ లైసెన్స్‌లు తదితర వాటితో పనిలేకపోవడంతో ఎవరైనా ఐదే ఐదు నిమిషాల్లో యూట్యూబ్ చానళ్లను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో చాలామంది యూట్యూబ్‌లో సొంతంగా న్యూస్ చానెళ్లను పెట్టుకుని రిపోర్టర్లుగా చలమణి అవుతున్నారు. మీడియాతో సంబంధాలు లేనివారు సైతం ఇలా చేయడం వల్ల ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

డబ్బుకు ఆశపడి వీరు సంఘవిద్రోహ శక్తులకు అమ్మడుపోతే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉందంటున్నారు. కీలకమైన స్థావరాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని వీరిని ఉపయోగించుకుని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. యూట్యూబ్ చానెళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పాప్యులర్ చానళ్ల జోలికి పోకుండా ఏదో ఒక లోగోతో తిరుగుతున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అక్రెడిటేషన్ జర్నలిస్టుల విషయంలో కాకుండా మిగతా వారి విషయంలో జాగురూకతతో వ్యవహరించాలని, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాలని సూచించింది. వారిలో ఎవరికైనా నేరచరిత్ర ఉన్నా, యూట్యూబ్ చానల్ పేరుతో లోగోలు పట్టుకుని కనిపించినా ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News