: రాజధాని పేరుతో రియలెస్టేట్ వ్యాపారం: చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల ధ్వజం
అమరావతిలో ప్రజా రాజధానిని నిర్మిస్తామని చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు అక్కడ రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇందులో వచ్చిన అవినీతి సొమ్మునంతా తన సొంత ఖజానాకు తరలిస్తున్నారని అన్నారు. రాజధానికి ఇప్పటి వరకు ఏడు సార్లు శంకుస్థాపన చేశారని... ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు.
మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందో చూడండంటూ ఆయన ఓ ఫొటోను మీడియాకు చూపించారు. రాజధానిగా అమరావతి పనికి రాదనే విషయాన్ని నిపుణులు కూడా చెప్పారని, అయినా చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరిట 33 వేల మంది రైతులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.