: పట్టిస్తే పది లక్షలు... గౌరీ లంకేశ్ హంతకులపై భారీ రివార్డు
బెంగళూరులో దారుణ హత్యకు గురికాబడిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను హత్య చేసిన వారిని పట్టిస్తే రూ. 10 లక్షల బహుమతి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కేసులో దర్యాఫ్తు జరుగుతున్న తీరును హోం మంత్రి రామలింగారెడ్డితో కలసి సమీక్షించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, త్వరగా నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.
కాగా, ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. హంతకుడి వయసు 30 సంవత్సరాల వరకూ ఉండవచ్చని, హెల్మెట్ ధరించి వచ్చాడని ఆపై పారిపోయాడని వెల్లడించారు. నిందితుడి ఊహా చిత్రాన్ని రూపొందించి, అతని ఆచూకీ కోసం రాష్ట్రమంతా గాలిస్తున్నట్టు తెలిపారు. కాగా, లంకేశ్ కుటుంబీకులు కోరితే దర్యాఫ్తును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.