: టిప్ ఇవ్వలేదని బిడ్డను దాచిపెట్టి బెదిరించిన స్టాఫ్ నర్స్!
పండంటి బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అయి వెళ్లిపోతున్నపుడు కృతజ్ఞతగా టిప్ ఇవ్వలేదని బిడ్డను స్టాఫ్ నర్స్ రెండు గంటలపాటు దాచిపెట్టిన సంఘటన హర్యానాలోని సోనెపట్ ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. సాధారణ డెలివరీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన సంగీత సింగ్‌ను టిప్ కోసం బిడ్డను దాచిపెట్టి స్టాఫ్ నర్స్ సీమా దేవి బెదిరించిందని ప్రధాన ఆరోగ్య అధికారికి సంగీత బంధువులు ఫిర్యాదు చేశారు. అలాగే సంగీతకు చికిత్స కూడా సరిగా చేయలేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయంలో విచారణ చేపట్టి, సంబంధిత నర్సు మీద చర్య తీసుకుంటామని ప్రధాన ఆరోగ్య అధికారి డా. సీపీ అరోరా తెలిపారు. టిప్ అడగడం చట్టవ్యతిరేకం అని తెలిసినా హర్యానాలోని చాలా ఆసుపత్రుల్లో ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆడపిల్ల పుడితే రూ. 300, మగబిడ్డ పుడితే రూ. 3000 వరకు టిప్ వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఫిర్యాదులు రావడంతో టిప్‌లు అడగవద్దని నర్సులను సీపీ అరోరా హెచ్చరించారు.