: అవసరమైతే భారత్ లోనే చస్తాం కానీ, అక్కడకు మాత్రం వెళ్లం!: మయన్మార్ 'రోహింగ్యా' ముస్లింలు


మయన్మార్ (బర్మా)లో తాము ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పడుకోలేదని భారత్ లో అక్రమంగా చొరబడి, శరణార్థులుగా బతుకీడుస్తున్న రోహింగ్యా ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణంలోనైనా ఆర్మీ వచ్చి విరుచుకుపడేదని, క్షణక్షణం ప్రాణాలు అరచేత పెట్టుకుని బతికామని చెప్పారు. ఇండియాలో చెత్తకుప్ప పక్కన పడుకున్నా, బతుకుతామనే ధైర్యం ఉందని... రాత్రి ఎలా గడుస్తుందో అనే బెంగ లేదని తెలిపారు. ఢిల్లీలోని షహీన్ బాగ్ లో చెత్తకుప్ప పక్కన నివసిస్తున్న నూర్ ఆలంతో పాటు మరి కొందరు రోహింగ్యాలు చెప్పిన మాట ఇది. ఈ ప్రాంతంలో 72 రోహింగ్యా శరణార్థ కుటుంబాలు నివసిస్తున్నాయి. 12 మంది కుటుంబసభ్యులతో కలసి నూర్ ఆలం నివసిస్తున్నాడు. ఇక్కడ కటిక పేదరికం అనుభవిస్తున్నప్పటికీ, ప్రశాంతంగా ఉన్నామని అతను తెలిపాడు.

గత కొన్నేళ్లుగా మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యా తిరుగుబాటుదారులకు, ఆర్మీకి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ లో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ ను ఆర్మీ భారీ ఎత్తున చేపట్టింది. ఈ క్రమంలో, ఊళ్లకు ఊళ్లు నాశనం అయిపోయాయి. అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో, వేలాది మంది రోహింగ్యాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, పొరుగు దేశాలకు పారిపోయారు. అలాంటి వారిలో నూర్ ఆలం కూడా ఒకరు. సైనిక ఆపరేషన్ ను తప్పించుకుని అతను బర్మాను వీడాడు. సైనిక ఆపరేషన్ లో ఆయన తన దూరపు కుటుంబసభ్యులందరినీ కోల్పోయాడు. ఈ క్రమంలో, మరికొందరితో కలసి 15 రోజుల పాటు నడిచి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి భారత్ లో ప్రవేశించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూటా నుంచి ఎవరైతే తప్పించుకున్నారో, వారే బర్మా నుంచి బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. అవసరమైతే ఇక్కడే చస్తాం కానీ, బర్మాకు మాత్రం మళ్లీ తిరిగి వెళ్లబోమని చెప్పాడు.

  • Loading...

More Telugu News