: 'ఇర్మా' బీభత్సం... చిగురుటాకులా వణుకుతున్న ఫ్లోరిడా... ప్రవాసుల క్షేమంపై బంధువుల ఆందోళన!
గడచిన 24 గంటల వ్యవధిలో కరేబియన్ దీవుల్లో బీభత్సం సృష్టించిన 'ఇర్మా' తుపాను, ఇప్పుడు అమెరికాను అతలాకుతలం చేస్తోంది. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో 'ఇర్మా' విరుచుకుపడుతుండగా, ఫ్లోరిడా చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటికే హార్వే తుపాను నష్టం నుంచి తేరుకోని అమెరికాను ఇప్పుడు ఇర్మా తుపాను నష్టపరుస్తోంది. తొలుత ఆంటిగ్వా, బార్బుడాలపై ప్రతాపం చూపిన ఇర్మా, సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని 95 శాతం మేరకు ధ్వంసం చేసి, ఆరుగురి ప్రాణాలను బలిగొని ఫ్లోరిడా వైపు కదిలింది.
గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండగా భారీ ఆస్తినష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. తుపాను బీభత్సంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు కుప్పకూలాయి. వర్జిన్ ఐలాండ్స్, పొటొరికోలోనూ ఇర్మా పెను ప్రభావాన్ని చూపింది. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే ఫ్లోరిడాపై ఇర్మా ప్రతాపం చూపిస్తుండటంతో, అక్కడి వారి క్షేమసమాచారాలు తెలియక, ఇండియాలోని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. ఇర్మా ప్రయాణించే మార్గాల్లోని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.